ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ గురువారం రాత్రి ఢిల్లీ వచ్చారు. శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అవుతారు.
సీఎం జగన్ గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
సీఎంకు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, నందిగం సురేష్, రెడ్డప్ప, అయోథ్య రామిరెడ్డి, వంగా గీత, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం.గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
source : sakshi.com
Discussion about this post