ఎవరేమనుకున్నా సరే.. మేం మారమంతే.. అన్నట్లుంది వైకాపా నాయకుల ప్రచార తీరు. కదిరి పురపాలక సంఘం కమిషనర్ కిరణ్‌కుమార్ అధ్యక్షతన గురువారం డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమం వైకాపా ఎన్నికల ప్రచార వేదికగా మారింది. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని మెప్మా అధికారులు కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. వైకాపా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్బూల్ అహమ్మద్ ఆద్యంతం హడావుడి చేశారు. వేదికపై కార్యక్రమ అధ్యక్షుడైన కమిషనర్ కిరణ్‌కుమార్‌కే కుర్చీ దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రేక్షకుడిలా మూలన నిలబడాల్సి వచ్చింది. వేదిక ముందు వరుసలో పురపాలక సంఘం చైర్‌పర్సన్ నజీమున్నీసా, వైస్ ఛైర్‌పర్సన్ గంగాదేవి, ఆమె పక్కన కౌన్సిలర్ ఇస్మాయిలత్ తప్ప మిగిలినవారంతా పార్టీ నాయకులే కావడం గమనార్హం.
అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మగ్బూల్ అహమ్మద్, ఇతర నాయకులు మాట్లాడుతూ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలందరూ మరోసారి సీఎంగా జగన్‌మోహన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలుగా వైకాపా అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపెట్టారు. ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సీఎం జగన్ సిద్ధం సభకు రావాలని మహిళలను కోరారు.
source : eenadu.net
Discussion about this post