చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్రం తిరిగి సుభిక్షంగా మారుతుందని.. అమరావతే గెలుస్తుంది.. నిలుస్తుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం నిర్వహించి చంద్రబాబు అరెస్టు సమయంలో ఆవేదనతో మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించి, రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. అనంతరం రాజధాని గ్రామం వెంకటపాలెంలో మహిళా పాడి రైతులతో సమావేశమయ్యారు. భువనేశ్వరి మాట్లాడుతూ నిండు గర్భిణి అన్న ఆలోచన కూడా లేకుండా పోలీసులు అమరావతి మహిళ పొత్తికడుపులో కర్కశంగా తన్ని ఆమె బిడ్డను చంపిన విషయం మరచిపోలేదన్నారు. వైకాపా అరాచక పాలనలో పోలీసుల దాష్టీకంతో మహిళల వస్త్రాలు చిరిగిపోయాయని, గోళ్లతో రక్కారని, లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…
అమరావతిపై కక్షతో మహిళలను ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం ఏ సాధించిందో చెప్పాలని భువనేశ్వరి ప్రశ్నించారు. అమరావతి సాధన కోసం 1,500 రోజులకు పైగా ఉద్యమం చేస్తుండటంతో రైతులు, మహిళల పోరాట పటిమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. కష్టకాలంలో తన కుటుంబానికి, తెదేపాకు అండగా నిలిచిన రాజధాని రైతులకు కృతజ్ఞతతో ఉంటామన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని, 11 రాష్ట్రాల్లో విస్తరించిన హెరిటేజ్ సంస్థ ఎండీగా ఉన్న తానే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే తాను, కోడలు బ్రాహ్మణి వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి సముచిత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post