డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పట్టిన ఆశా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న మహిళలను ఈడ్చిపడేశారు. దుస్తులు ఊడిపోతున్నా కనీస స్పృహ లేకుండా బస్సుల్లోకి తోసేశారు. ‘చలో విజయవాడ’ ఆందోళనలో భాగంగా వివిధ జిల్లాల నుంచి గురువారం వేల సంఖ్యలో ఆశా కార్యకర్తలు తరలివచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు నియంత్రణ కోల్పోయి ప్రవర్తించారు. ఎక్కడికక్కడ వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆశాల నిరసనలు, నినాదాలు, పోలీసుల నిర్బంధాలతో విజయవాడ, మంగళగిరి ప్రాంతాలు దద్దరిల్లాయి.
వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ ఆశా కార్యకర్తలు గురువారం ‘చలో విజయవాడ’ చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు తెల్లవారుజాము నుంచే విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాచౌక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చినవారిని వచ్చినట్లు అరెస్టు చేసి బస్సుల్లో వివిధ స్టేషన్లకు తరలించారు. బీఆర్టీఎస్ రోడ్డులోనూ ఆశా కార్యకర్తలుగా భావించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి మంది వర్కర్లను మచిలీపట్నంలోని పోలీసు శిక్షణ కేంద్రం, ఏలూరు జిల్లా కైకలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు తరలించి సాయంత్రం వరకూ నిర్బంధించారు.
దద్దరిల్లిన మంగళగిరి, విజయవాడ
వడ్డేశ్వరం వద్ద ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా చెదరగొట్టడంతో, మరికొందరు మంగళగిరిలో ఆందోళనకు దిగారు. ఏపీఐఐసీ భవనంలోని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి కూడలి వద్ద కొందరిని అడ్డగించగా, వారు అక్కడే బైఠాయించారు. ఒంటి గంట సమయంలో మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు అక్కడికి రాగా, ఇరువర్గాల నడుమ తీవ్ర తోపులాట జరిగింది. కొందరి దుస్తులు చిరిగిపోయాయి. మహిళా పోలీసులే కార్యకర్తల చెంపలపై కొట్టారు. వీరికి మగ పోలీసులు జత కలిశారు. ప్రశ్నించేలోపే వారిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు.
దాడులు హేయనీయం
మంగళగిరిలో నిర్బంధించిన ఆశా కార్యకర్తలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తెదేపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మి, మంచికలపూడి వైష్ణవి తదితరులు పరామర్శించారు. మహిళలపై మగ పోలీసులు దాడి చేయడాన్ని వారు ఖండించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్చలకు పిలిచి యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మిని అరెస్టు చేయడం హేయమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలు దాటించి బస్సుల్లో తరలింపు
అరెస్టు చేసిన ఆశాలను వివిధ మార్గాల్లో తిప్పుతూ ఏలూరు జిల్లా కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, నూజివీడు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మండవల్లి మండలం భైరవపట్నంలోని కల్యాణ మండపానికి కొందరిని తీసుకురాగా, విజయనగరం, శ్రీసత్యసాయి జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలు లోనికి వెళ్లకుండా సమీప ఆలయంలో బైఠాయించారు. ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఏలూరు, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన వారిని మూడు బస్సుల్లో నూజివీడుకు తరలించి సారథి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్బంధించారు. అక్కడ తాగేందుకు మంచినీళ్లూ ఇవ్వలేదని మహిళలు వాపోయారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎన్.నరసింహపై నూజివీడు సీఐ దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలొచ్చాయి. ఉదయం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తల బస్సును కైకలూరు పోలీస్ స్టేషన్ వద్ద నిలిపేశారు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకూ అవకాశమివ్వలేదు. మీడియా ప్రతినిధులు వచ్చి ప్రశ్నించడంతో వారి బస్సును పంపించారు.
ఆశా కార్యకర్తలను బుధవారమే వారి సొంతూళ్లలో పోలీసులు నిర్బంధించారు. అయినా, వివిధ మార్గాల్లో బెజవాడ పరిసరాలకు చేరుకున్న వందల మంది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, హైవే పక్కనున్న కౌలు రైతు కార్యాలయానికి వచ్చారు. పోలీసులు వారు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. ఉదయం ఒక్కసారిగా ఆశాలు గేట్లు నెట్టుకుంటూ, గోడ దూకి హైవే సర్వీసు రోడ్డుపైకి వచ్చారు. అక్కడే కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రోడ్డుపైనే బైఠాయించడంతో గంటపాటు హైవేపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మహిళా సిబ్బందిని ముందుపెట్టి మగ పోలీసులు ఆశాలను ఈడ్చేశారు. తాడేపల్లి సీఐ మధుసూదన్‌రావు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్ల గాజులను గట్టిగా ఒత్తడంతో పగిలిపోయి, చేతులకు రక్త గాయాలయ్యాయి. కొందర్ని లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. దుస్తులు జారిపోతున్నాయని చెప్పినా వినకుండా కర్కశంగా వ్యవహరించారు.ఓ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు.
source : eenadu.net
Discussion about this post