జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వుబ్యాంకు ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది.. అందుకోసం ఏకంగా రూ. 149 కోట్ల మేర వడ్డీలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వ నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిరోజులైతే రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వ కూడా లేని పరిస్థితి! ప్రభుత్వ చెల్లింపులన్నీ రిజర్వుబ్యాంకు ద్వారానే జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తూ కాగ్ తేల్చిన లెక్కలివి. ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వుబ్యాంకు ముందస్తుగా ప్రభుత్వం కోరినట్లు చెల్లింపులు చేస్తూ ఉంటుంది. వాటినే చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యంగా పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నగదు నిల్వలు లేనప్పుడు రిజర్వుబ్యాంకు ఇచ్చే ఇలాంటి సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్), అడ్వాన్సులు, ఆ తర్వాత ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద తాత్కాలిక అప్పు తీసుకుంటారు. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ కింద నిధులు వినియోగిస్తారు. వీటన్నింటికీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,18,039 కోట్లు ఇలా తెచ్చినవే. ఇందులో రూ. 57,066 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో తెచ్చింది. అంతేకాదు ఆ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,027 కోట్లు అదనంగా చెల్లింపులు చేసేసింది. ఈ లెక్కలను కాగ్ గురువారం శాసనసభకు సమర్పించింది.
అప్పు తెచ్చినా అభివృద్ధికి వెచ్చించింది కొంతే
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారమే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 67,985 కోట్లు వివిధ రూపాల్లో రుణాలుగా తీసుకుని.. రూ. 9,017 కోట్లు మాత్రమే ఉపయోగపడే వ్యయం చేసింది. అందులోనూ రూ. 7,244 కోట్లు మాత్రమే మూలధన వ్యయం కాగా, మిగిలింది అప్పులు తీర్చడానికే వెచ్చించింది. భారీగా అప్పులు తెచ్చినా అభివృద్ధికి ఖర్చు చేసిన మొత్తం ఎంత స్వల్పంగా ఉందో కాగ్ ఈ గణాంకాల్లో పేర్కొంది. మిగిలిన నిధులన్నీ రెవెన్యూ వ్యయంగానే ఖర్చు చేసినట్లు భావించాల్సి ఉంటుంది. అభివృద్ధి క్రమంలో మూలధన వ్యయం ఎంతో కీలకమని- అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరంలో అందుకోసం వెచ్చించిన మొత్తం చాలా స్వల్పమని కాగ్ విశ్లేషించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక్కశాతం కూడా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదు. జీఎస్‌డీపీలో 0.55 శాతం మాత్రమే ఇందుకోసం ఖర్చు చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ. 23,436 కోట్లు మూలధన వ్యయంగా ప్రతిపాదించినా రూ. 7,244 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 4,224 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పోర్టులు, లైట్ హౌస్‌ల నిర్మాణానికి కేవలం 46 లక్షలు మాత్రమే వెచ్చించింది. భవనాల నిర్మాణానికి రూ. 403 కోట్లు, రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ. 488 కోట్లు, రక్షిత నీటి సరఫరాకు రూ. 66 కోట్లు మూలధన వ్యయంగా వెచ్చించిందని కాగ్ పేర్కొంది.
పెరుగుతూ పోతున్న రెవెన్యూ లోటు
రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెరుగుతూ పోతోంది. రాబడి కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటే అది రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు. ఈ లోటును ఎంత పరిమితం చేస్తే అంత ఆర్థిక నిర్వహణ సరిగా ఉన్నట్లు లెక్క రాబడితో పోలిస్తే లోటు ఎంత శాతం ఉందో కాగ్ లెక్కించింది. 2018-19లో రాష్ట్రంలో 12.12 శాతమే లోటు ఉంది. అది 2019-20 నాటికి 23.81 శాతానికి పెరిగిపోయింది. ఆ మరుసటి ఏడాది ఏకంగా 30.34 శాతానికి చేరింది. 2021-22లో 5.72 శాతానికి పరిమితం చేసినా 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 28 శాతానికి పెరిగిపోయింది.
విద్యుత్తు సుంకంతో పిండేశారు
రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్తుపై పన్నులు, సుంకాలు పెరిగిపోయాయని తేలింది. 2018-19 నుంచి 2021-22 వరకు ఏటా కేవలం రూ. 11 కోట్లు లేదా రూ.13 కోట్లు మాత్రమే ఈ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వచ్చింది. అలాంటిది 2022-23 సంవత్సరంలో ఏకంగా రూ. 4,243 కోట్లు రాబడి సాధించింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఒక్కసారిగా పన్నులు పెంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రకరకాల మార్గాల్లో రుణాలు ఇలా..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నడిపేందుకు వివిధ మార్గాల్లో రుణాలు తీసుకుంది. ఇవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కలు. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న ఇతర రుణాల, గ్యారంటీ రుణాల సమాచారం ఇక్కడ పొందుపరచలేదు.
source : eenadu.net
Discussion about this post