సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ధర్మవరం, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచేందుకు, అలాగే కౌంటింగ్ కేంద్రాలకు గుర్తించిన భవనాలను కలెక్టర్ అరుణ్‌బాబు బుధవారం పరిశీలించారు. తొలుత ధర్మవరం వెళ్లిన కలెక్టర్..గుట్టకిందపల్లిలోని మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈవీఎంల భద్రత, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు కోసం సౌకర్యాలు ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల క్‌లైయిమ్‌ల పరిష్కారంపై రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. ఎర్రగుంట, మారుతీనగర్‌లోని సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వెంకటశివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ రమేష్ ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల కోసం గుర్తించిన భవనాల వద్ద సౌకర్యాలపై కలెక్టర్ అరుణ్‌బాబు ఆరా తీశారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్‌తో కలిసి మడకశిరలోని ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలతో పాటు హిందూపురం ఎంజీఎం హైస్కూల్ నూతన భవనాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్డు సౌకర్యంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
source : sakshi.com
Discussion about this post