ఎన్నికల కదనరంగంలో వైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. శ్రేణులను మహా సంగ్రామానికి ‘సిద్ధం’ చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఈ క్రమంలోనే రాయలసీమ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 18న రాప్తాడు రానున్నారు. స్థానిక ఆటోనగర్ వద్ద నిర్వహించే ‘సిద్ధం’ బహిరంగ సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది తరలివచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాప్తాడు ‘సిద్ధం’ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తరలివచ్చే శ్రేణులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమలోని 50 నియోజకవర్గాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు లక్షల సంఖ్యలో పార్టీ శ్రేణులు సిద్ధం సభకు హాజరు కానుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 19కి పైగా పార్కింగ్ ప్రాంతాలు గుర్తించారు. సభావేదిక వెనుక భాగంలో సీఎం హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారు. సభావేదిక ముందు భాగంలో సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు దగ్గరగా వెళ్లి అభివాదం చేయడానికి వీలుగా సుమారు కిలో మీటరు విస్తీర్ణంతో ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చ్జా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం బుధవారం పరిశీలించారు. సభా వేదిక వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అనంతపురం ఏఆర్, రూరల్ డీఎస్పీలు మునిరాజు, వెంకట శివారెడ్డితో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమీక్షించారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, వీఐపీ పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, సీఎం సభాస్థలి, హెలీ ప్యాడ్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త శాంతమ్మ, ప్రభుత్వ సలహాదారు ఆలూరి సాంబశివా రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాయదుర్గం, మడకశిర సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, ఈర లక్కప్ప, అనంతపురం, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు బోయ గిరిజమ్మ, శ్రీనివాసులు, అహుడా చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ నాయకులు చిట్రా వెంకటేష్, పసుపుల ఆది, తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post