అనంతపురం గ్రామీణ మండలాల్లో తెదేపా పూర్వ వైభవం సంతరించుకుంటోంది. గ్రామాల్లోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. వైకాపా పాలనతో, ఆ పార్టీ నాయకులతో విసిగి పెద్ద ఎత్తున కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. పామురాయి, రాచానపల్లి, పాపంపేట గ్రామాల్లో వైకాపాకు చెందిన 85 కుటుంబాలు బుధవారం మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో తెదేపాలో చేరాయి. పామురాయి ఎంపీటీసీ సభ్యురాలు కె.లక్ష్మి, విశ్వనాథ్, ఉప సర్పంచి రజని, వెంకటరమణ, చౌక ధాన్యం దుకాణ డీలరు శ్రీనివాసులు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కె.పెద్దన్న, రాచానపల్లి, పాపంపేటలో నాయకులు మాజీ ఎమ్పీటీసీ గువ్వల రమణారెడ్డి, ప్రతాపరెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ముత్యాలరెడ్డి, విజయమ్మ, మధుసూదన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, శంకర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, శ్రీనివాసులు, శంకర్, వినోద్, మధు, పెద్దక్క, చిన్నక్క తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పామురాయి గ్రామంలో, అనంతపురం క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది. పరిటాల సునీత వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా నాయకుల తీరుతో విసిగిపోయామని, పరిటాల సునీతపై నమ్మకంతో తెదేపాలో చేరామని ప్రకటించారు. అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు పేదలకు చేరాలన్న అది చంద్రబాబుతో సాధ్యమని, తెదేపా గెలిపించుకునేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్పీటీసీ, వైకాపా నాయకులు రమణారెడ్డి ప్రకటించారు. అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిటాల సునీత పిలుపునిచ్చారు. పామురాయి తనకు పుట్టినిల్లు లాంటిదని, గ్రామంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పామురాయి మండల కార్యదర్శి రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post