వారంతా సామాన్యులు.. ఎక్కడెక్కడి నుంచో బుధవారం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలని వేచి చూశారు. సీఎం వాహన శ్రేణితో వెళ్తున్న సమయంలో ఆయనకు అభివాదం చేస్తూ.. పట్టుకొచ్చిన అభ్యర్థన పత్రాలను చూపిస్తూ తమ సమస్యలను చెప్పబోయారు. అయితే ముఖ్యమంత్రి ఆగకుండా వెళ్లిపోతూనే.. వెనుక వస్తున్న వారికి ఇవ్వండి అన్నట్లు సైగ చేశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో జనం ‘ఎవరూ లేరు సార్’ అన్నట్లుగా చేతులూపారు. అయినా సీఎం మళ్లీ వేలిని వెనక్కు చూపిస్తూ ముందుకు సాగిపోయారు. దీంతో విన్నపాలు చెప్పుకోవాలని వచ్చినవారు తమ సమస్యలకు ఎవరికి విన్నవించాలో అర్థంకాక ఉసూరుమంటూ వెనుదిరిగారు. వారిలో అత్యధికులు వైకాపా ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే.
వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుని పాసులు దక్కించుకుని అసెంబ్లీ లోపలికైతే రాగలిగారు. సీఎం జగన్ కోసం ఆవరణలో వేచి చూశారు. సభ వాయిదా పడ్డాక జగన్ అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో కొందరు సందర్శకులను కలిశారు. సీఎం బయటకు వచ్చినా ‘దర్శనం’ దొరక్క సామాన్యులు మాత్రం అక్కడే నిలబడిపోయారు. వారిని అసెంబ్లీ మార్షల్స్ బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఒకదశలో కొందరు మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎంను కలిసి వినతిపత్రం ఇద్దామని ఎంత దూరం నుంచో వచ్చాం’ అంటూ వారితో వాదనకు దిగారు. చివరకు ముఖ్యమంత్రి కలవకపోవడంతో వారు అసంతృప్తితో వెళ్లిపోయారు.
కాబోయే అభ్యర్థులకూ..
ఇటీవలే వివిధ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలుగా నియమితులైన పలువురు ముఖ్యమంత్రిని కలుద్దామని బుధవారం అసెంబ్లీకి వచ్చారు. వారంతా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కాబోయే అభ్యర్థులు. కానీ దర్శన భాగ్యం దొరక్కపోవడంతో వారంతా ఇతర సందర్శకుల్లానే అసెంబ్లీ ఆవరణలో సీఎం బయటకు వచ్చేవరకు వేచి చూసి.. ఆయన కార్లో బయటకు వెళుతున్నపుడు కనిపించే ప్రయత్నాలు చేశారు.
source : eenadu.net
Discussion about this post