అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితేనే చిత్తశుద్ధి అంటారని చెప్పిన జగన్‌కు డీఎస్సీ ప్రకటించాలని తెలియలేదా? ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డీఎస్సీ, ఏటేటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టారు. ఎన్నికల ఏరు దాటాక హామీ తెప్ప తగలేశారు. సుమారుగా మార్చి రెండోవారంలో ఎన్నికల షెడ్యూలు వస్తుంది. ఆ తర్వాత నియామకాల ప్రక్రియకు భరోసా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పటికే మార్చి అయిదో తేదీ వచ్చేస్తుంది. ఆ తర్వాత 15 నుంచి పరీక్షల షెడ్యూలు పెట్టారు. అంటే డీఎస్సీ ప్రకటించినా.. అది ముందుకు సాగకూడదనే ఉద్దేశమే కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలో డీఎస్సీ అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా? నిరుద్యోగులను మోసం చేయాలనే ఇప్పుడు ప్రకటన ఇచ్చారా? అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుల్లో కోత
నాణ్యమైన విద్య అందాలంటే ఉపాధ్యాయులు ఉండాలి. ప్రపంచబ్యాంకు రుణం కోసం మానవవనరులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. అందుకే నియామకాల్లో కోత వేసింది. 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నతబడుల్లో విలీనం చేసి, ఎస్జీటీ పోస్టులు లేకుండా చేసింది. ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చి సబ్జెక్టు టీచర్ల ఖాళీలను మాయం చేసింది. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో 2023 సెప్టెంబరు 22న 8,366 పోస్టులు భర్తీచేస్తామన్న మంత్రి బొత్స.. ఇప్పుడు ఖాళీలే లేవంటున్నారు. వాస్తవంగా 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవీ కేవలం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడుల్లోని ఖాళీలే. 23వేల ఖాళీలున్నాయని ప్రతిపక్షనేతగా జగన్ చెప్పారు. మరి ఇవన్నీ ఏమైపోయాయి?
రెండూ ఒకేసారి ఎలా?
డీఎస్సీ, టెట్‌ను ప్రభుత్వం ఒకేసారి పెట్టింది. ఈ రెండింటికీ ఒకేసారి సన్నద్ధం కావడం ఎలా సాధ్యం? టెట్‌కు 20 రోజుల సమయమే ఇవ్వగా.. డీఎస్సీకి 31 రోజులు ఇచ్చారు. టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల చేయనున్నారు. కానీ, డీఎస్సీకి దరఖాస్తులు ఈ నెల 12 నుంచే స్వీకరిస్తున్నారు. టెట్ మార్కులు లేకుండానే డీఎస్సీకి అనుమతిస్తారా అనేదానిపైనా స్పష్టత లేదు.
సిలబస్‌పై స్పష్టత ఏదీ?
పాఠశాల విద్యాశాఖ సిలబస్‌ను మార్చింది. 8, 9 తరగతులకు పూర్తిగా జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌నే వినియోగిస్తోంది. వచ్చే ఏడాది పదో తరగతికి ఇదే సిలబస్ అమలు చేస్తున్నారు. 1-7 తరగతులకు సైతం గతేడాది దాదాపుగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్సే తీసుకొచ్చింది. అంతకుముందు రాష్ట్ర సిలబస్‌ను మార్చింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ నియామకాలే చేపట్టలేదు. డీఎస్సీ-2018 తర్వాత పాఠ్యపుస్తకాలను మార్చుతూ వస్తోంది. 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ అంటున్నారు. ఇంతకూ ఏ సిలబస్ ఇస్తారనేదానిపై అభ్యర్థుల్లోనూ అయోమయం ఉంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. సిలబస్ పూర్తిగా మారిపోతే అభ్యర్థుల సన్నద్ధతకు సమయం సరిపోతుందా? అనేదాన్ని చూడలేదు. కర్నూలు జిల్లా మినహా ఎక్కడా 111 పోస్టులకు మించలేదు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున పోటీ ఎక్కువగా ఉంటుంది.
source : eenadu.net
Discussion about this post