అమరావతి: ఏపీలో ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు వేచి చూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్ అసిస్టెంట్ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు. AP DSC 2024 పరీక్షతో పాటు AP TET 2024 పరీక్షకూ నోటిఫికేషన్ విడుదల చేశారు. టెట్‌కు ఫిబ్రవరి 8 నుంచి, డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదే..
ఏపీ డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మాక్ టెస్ట్‌ను ఫిబ్రవరి 24 నుంచి రాయొచ్చు. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తెస్తారు. డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. సెషన్ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; సెషన్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటిస్తారు.
ఏపీ టెట్ షెడ్యూల్..
ఏపీ టెట్ పరక్షకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ మాక్ టెస్ట్ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్ హాల్ టికెట్లు ఫిబ్రవరి 23నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న తుదికీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు.
source : eenadu.net
Discussion about this post