కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. కడప నగరంలోని చిన్నచౌక్ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవర్గ బాధ్యురాలు మాధవి, జనసేన పార్టీ జిల్లా బాధ్యులు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు యువత, వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని, చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం నగరంలోని 11వ డివిజన్ పరిధిలో అంబేడ్కర్ భవన్ నుంచి బాబు స్యూరిటీ…భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పదేళ్ల పాటు కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్‌బాషా కడప నగరానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప బాధ్యురాలు మాధవి ప్రశ్నించారు. కడపలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేకు భయం పట్టుకుందని, అందుకే తెదేపా స్టిక్కర్లు తొలగిస్తున్నారన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలపై కడప ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు.
source : eenadu.net
Discussion about this post