పూర్తిచేయకుండానే ప్రారంభించారు
మిగిలిన పనులు పట్టించుకోని వైనం
‘‘ తానే ముఖ్యమంత్రిగా ఉంటే కరవు సీమను పచ్చని సీమగా మార్చేసేవాడిని.. అవుకు ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేసేవాడిని.. రాయలసీమ కరవు జిల్లాలు 20 వేల క్యూసెక్కుల నీటితో సస్యశ్యామలం అయ్యేవని ఎన్నికల ముందు జగన్ జనాన్ని నమ్మించారు. ’’
‘‘ 2021 మార్చి నాటికల్లా అవుకు టన్నెళ్ల తవ్వకాలు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కులు మళ్లిస్తాం.. ఒక ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికార పీఠమెక్కిన తొలినాళ్లల్లో పేర్కొన్నారు. దాదాపు వెయ్యి మీటర్ల మేర లైనింగు పూర్తి చేయనేలేదు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవంబరు 30న ప్రారంభోత్సవం చేశారు.. అవుకు టన్నెల్ పూర్తి చేశాం.. ఇవిగో నీళ్లు అంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు. నాలుగు రోజుల పాటు అతికష్టంమీద 1 టీఎంసీ నీటిని పంపించారు. ఆ తర్వాత టన్నెల్ గురించి పట్టించుకోవడం మానేశారు… మిగిలిన పనులు చేయడం లేదు. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుతానికి అవుకు అయిపోయిందని చెప్పి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.
లేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా అవుకు మండలంలో కొండలను తొలచి గండికోట జలాశయానికి తరలించాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్‌ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని 2018-19లోనే మళ్లించారు. మరో టన్నెల్ పనులు సాగుతుండగానే ఎన్నికలొచ్చాయి. అధికారంలోకి వచ్చిన జగన్ నిధులివ్వకపోడంతో పనులు నాలుగున్నరేళ్లుగా సా..గుతున్నాయి. అసంపూర్తిగా ఉన్నా ఎన్నికల ముంచుకొస్తున్న వేళ గత నవంబరు 30న ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేళ గోరుకల్లు నుంచి నీటిని తరలించారు. ఆ తర్వాత నీటిని నిలిపివేశారు.
source: eenadu.net
Discussion about this post