అవినీతి, అక్రమాలకు మారుపేరైన పుంగనూరు పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాను దోచేస్తున్నారు.. అతని లెక్క తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జీడీనెల్లూరులో జరిగిన ‘రా.. కదలిరా.. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘అక్రమార్జనే ధ్యేయంగా పెద్దిరెడ్డి జిల్లాలో పాపాలు సాగిస్తున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని భారీగా లూటీ చేశారు.
నెలకోసారి కుప్పానికి వచ్చి గనుల నుంచి కప్పాలు కట్టించుకుంటున్నారు. చిత్తూరులో అవినీతి అక్రమాలకు పాల్పడిన వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వకుండా.. అంతకంటే పెద్ద మోసగాడైన విజయానందరెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరం. అంతర్జాతీయ స్మగ్లర్ అయిన విజయానందరెడ్డికి ప్రజలు ఎవరైనా ఓటేస్తారా? వైకాపాలో ఎక్కువ అవినీతికి పాల్పడిన వారికే టికెట్లు ఇస్తున్నారు. సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం పేరుతో రోజుకు 200 టిప్పర్ల ఇసుక అమ్ముకుని చివరికి అతడికి టికెట్ ఇవ్వలేదు. మద్యం పంపకాల్లో వచ్చిన వాటాల లెక్కలు పెద్దిరెడ్డి చూస్తే.. సంతకం మాత్రం నారాయణస్వామి చేస్తారు. జీడీ నెల్లూరులో విద్యాధికుడు, సేవాభావం కలగిన థామస్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మట్టిలో మాణిక్యం వంటి థామస్‌ను గెలిపిస్తే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పెద్ద అవినీతిపరుడైన కుమారుడికి టికెట్ ఇచ్చి.. ఆయన్ను ప్రమోషన్‌పై ఒంగోలుకు పంపడం విడ్డూరం. ఒక ఊరిలో చెడ్డవాడైన వ్యక్తి మరో ఊరిలో మంచివాడు ఎలా అవుతారో ప్రజలు గమనించాలి. పెద్దిరెడ్డి దౌర్జన్యాలను భరించలేకే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వైకాపాకు రాజీనామా చేసి తెదేపా వద్దకు వచ్చారు. మంత్రి రోజా.. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానని వైకాపా నేత వద్ద నగదు తీసుకోవడం వారి సంస్కృతికి నిదర్శనం. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడను అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి ధనార్జనకు పాల్పడలేదా? వెంకటేగౌడ కర్ణాటకలో పారిశ్రామికవేత్తను రూ.70 లక్షలకు మోసం చేసిన విషయం కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి’ అని చంద్రబాబు వివరించారు.
సభలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్, మాజీ మేయర్ హేమలత, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.రాజేశ్వరి, పూతలపట్టు, నగరి, తంబళ్లపల్లె నియోజకవర్గ బాధ్యులు మురళీమోహన్, గాలి భానుప్రకాష్, శంకర్, గురజాల జగన్మోహన్, మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ, అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చంద్రప్రకాష్,సీఆర్ రాజన్, కార్జాల అరుణ తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post