తెదేపా అభిమానం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నికల సమరానికి పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు అందిపుచ్చుకుని కార్యకర్తలు కదంతొక్కారు. ‘ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలవబోతున్నాం.. ఈ సభలో కార్యకర్తల సందడి చూస్తే గెలుపుపై నమ్మకం వచ్చేసింది. 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కానున్నాయి’ అంటూ తెదేపా అధినేత చెప్పడంతో ఆమోదం తెలుపుతూ జనగళంతో సభా స్థలి హోరెత్తింది. నియోజకవర్గానికి చాలా కాలంగా ఇన్‌ఛార్జి లేకపోవటంతో సభ ఎలా జరుగుతుందోనన్న అనుమానాలను తరలివచ్చిన జన ప్రభంజనం పటాపంచలు చేసింది. అధినేత రాకతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది. మహిళలు భారీగా హాజరయ్యారు. చింతలపూడి పరిధిలోని ఆంథోనినగర్‌లో సోమవారం నిర్వహించిన రా కదిలి రా సభ సూపర్ హిట్టయ్యింది. తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. సభలో చంద్రబాబు ప్రసంగం ప్రజల హర్షాల నడుమ సాగింది.
చంద్రబాబు సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లాలో సభ ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఆంథోని నగర్‌లోని ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకున్నారు. 3.30 గంటలకు సభా స్థలానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేదికపైన మాజీ ఎంపీ మాగంటి బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రసంగం ప్రారంభించి 5 గంటలకు ముగించారు. అనంతరం నియోజకవర్గంలో కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు.
source : eenadu.net
Discussion about this post