సీఎం జగన్ సొంత జిల్లాలోని వైకాపా నేతలు తెదేపాలో చేరిపోతున్నారు. మైదుకూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల్లో నిత్యం భారీ ఎత్తున చేరికలుంటున్నాయి. ఇటీవల జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో చేరికలు జరుగుతుండగా, తాజాగా బద్వేలు నియోజకవర్గంలోనూ ఊపందుకున్నాయి. అధికార పార్టీ నేతలు వివిధ అంశాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇసుక, మట్టి, గనులను కీలక నేతలే దోచుకుపోతుండగా, గుత్తేదారు పనులు చేసిన వారికి బిల్లులు రావడంలేదు. ఈ పరిస్థితిలో తీవ్ర అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ నేతలు తెదేపా వైపు చూస్తున్నారు. నేతలతో పాటు సామాన్య కార్యకర్తల నుంచి వలసలు అధికమయ్యాయి. దీంతో కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వివిధ గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలు తెదేపాలో చేరిపోతున్నారు. బద్వేలు నుంచి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితేష్‌రెడ్డి సైతం రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా సాధారణ కార్యకర్తలు, నేతలు పార్టీలో చేర్చుకుంటుండగా, కీలక నేతలు సైతం పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు. వీరిని గుర్తించి విజయమ్మ, ఆమె తనయుడు కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్ గురుమోహన్ సోదరులు సింగసాని విజయకుమార్ అలియాస్ బుజ్జి, సింగసాని గురురాజాలతో బద్వేలులోని వారి ఇంటికెళ్లి చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు నేతలతో చర్చించి తెదేపాలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనే హామీ ఇచ్చారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి అన్ని రకాలుగా అండగా ఉంటామనే అభయమిచ్చారు. త్వరలోనే పార్టీలో చేరికకు వైకాపా నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పలువురు నేతల చేరికకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉంది. ఈలోపు బిల్లులు చెల్లింపులు జరగకపోతే తెదేపాలోకి దూకేస్తామనే హెచ్చరికలు చేస్తున్నారు. సోమవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఎంపీటీసీసభ్యుడు వెంకటరమణ ఆధ్వర్యంలో 300 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వైకాపాకు చెందిన ఎంపీటీసీసభ్యుడు ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. కవలకుంట్ల గ్రామంలో మరో 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో తెదేపా బద్వేలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రోశన్న, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి రమేష్, నాయకులు వెంకటసుబ్బయ్య, బైరవ ప్రసాద్, చెరుకూరి చండ్రాయుడు, సర్పంచి సుధాకర్ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post