మొన్నటి వరకు వైకాపాలో ఉండి.. నిన్న తెదేపా కండువా కప్పుకొని.. నేడు తూచ్.. మేము వైకాపాలోనే కొనసాగుతామంటూ శాంతిపురం మండలం మఠం గ్రామ పంచాయతీ సర్పంచి మురళీ, ఎంపీటీసీ చంద్ర చెప్పుకొచ్చారు. స్థానిక వైకాపా ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం వైకాపా కండువాలు కప్పుకొన్నారు. తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో వైకాపా ప్రభుత్వంలో తమ గ్రామానికి ఎలాంటి న్యాయం జరగలేదని.. తెదేపాతోనే న్యాయం జరుగుతుందని భావించి పార్టీ మారుతున్నట్లు ప్రకటించి 24 గంటలైనా కాకముందే వారు తమ మాటలను వెనక్కి తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఆదివారం ఉదయం అధికార పార్టీ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో మళ్లీ వైకాపా కండువాలు కప్పుకొని తమను ప్రలోభాలకు గురి చేసి తెదేపాలో చేర్చుకున్నారు, వైకాపాతోనే తమ గ్రామం అభివృద్ధి జరుగుతుందని తాము వైకాపాతోనే ఉన్నామంటూ ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన కుప్పంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా నాయకుల మెడలపై రంగులు మారుతున్న రాజకీయాలు రాబోవు ఎన్నికల వేడి మరింత పెంచుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి సిత్రాలు మరెన్ని చూడాలో అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
source : eenadu.net
Discussion about this post