జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు.
సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు.
దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రణగర్జనకు… సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు.
source : sakshi.com
Discussion about this post