నా కోసం రెండు బటన్లు నొక్కండి
99 శాతం హామీలు నేరవేర్చాం
ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్
‘పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. మన మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99% నెరవేర్చాం. ప్రజాసంక్షేమం కోసం 124 సార్లు బటన్ నొక్కాను. మీరంతా ఈసారి ఎన్నికల్లో నాకోసం రెండు బటన్లు నొక్కండి’ అని సీఎం జగన్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా మల్కాపురం వద్ద ‘సిద్ధం’ పేరిట శనివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలు
‘రానున్న ఎన్నికలు ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేవి మాత్రమే కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవని ప్రచారం చేయండి. ఇంటింటా అభివృద్ధి, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ఇంటింటికీ చెప్పండి. పేదవాడి భవిష్యత్తు మీద, సంక్షేమం, వివిధ సామాజికవర్గాల అభివృద్ధి మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిపై తెదేపా దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్టసైన్యాన్ని, వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మన క్యాడర్, నాయకులు, అభిమానులు సిద్ధం కావాలి. గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నాను. లంచాలకు తావులేకుండా అభివృద్ధి చేశామని కాలర్ ఎగరేసి చెప్పొచ్చు. గత, ప్రస్తుత పాలనలోని వ్యత్యాసమేంటో లబ్ధిదారుల బ్యాంకుఖాతాలు చూస్తే తెలుస్తుంది. పథకాలు అమలుకావాలంటే జగన్ వల్లే సాధ్యమని చెప్పండి. ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లే. గత ఎన్నికల్లో ఓడించి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఈ సారితో తప్పిద్దాం బెడద శాశ్వతంగా తప్పిస్తేనే చంద్ర గ్రహణాలు ఉండవు’ అని చెప్పారు.
పొత్తుల కోసం పిలుస్తున్నారు
చంద్రబాబు తెదేపా పిలుస్తోంది రా.. కదలి రా అంటున్నది ప్రజల్ని కాదు. పార్టీలనే.. దత్తపుత్రుడిని ప్యాకేజీ కోసం కదలి రా అని పిలుస్తున్నారు. వదినమ్మను, రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన అడ్డగోలు పార్టీని కదలి రా అని పిలుస్తున్నారు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు ఈ రాష్ట్రానికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు. వారంతా ప్రవాసాంధ్రులు. సైకిల్ తొక్కడానికి ఇద్దరిని, తోయడానికి మరో ఇద్దరిని పొత్తు తెచ్చుకుని రా.. కదలిరా.. అంటూ పిలుస్తున్నారు. పొత్తు లేకపోతే ఆయనకు 175 మంది అభ్యర్థులే లేరు. ఇలాంటి పార్టీలన్నీ జగనన్నను, పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ చేస్తున్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా. ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టో విడుదల చేసి, వాగ్దానాలు చేస్తారు. తర్వాత చెత్తబుట్టలో పడేస్తారు. ఇప్పటి వరకు బాబు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదు’ అంటూ సీఎం విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post