● ఆసక్తికరంగా సాగిన బ్యాడ్మింటన్ పోటీలు
● నేడు క్రికెట్ ఫైనల్స్.. విజేతలకు బహుమతుల ప్రదానం
చిత్తూరులోని మెసానికల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలు హోరా హోరీగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ పురుషులు, మహిళల జట్ల ఫైనల్స్ ముగిశాయి. పురుషుల క్రికెట్ పోటీల్లో చిత్తూరు టీమ్ తొలుత బ్యాటింగ్ చేసి 92 పరుగులు సాధించింది. జీడీ నెల్లూరు జట్టు బ్యాటింగ్ చేస్తుండగా వివాదం తలెత్తడంతో డీఎస్‌డీఓ బాలాజీ మ్యాచ్‌ను రద్దు చేశారు. శనివారం ఉదయం 8.30 గంటలకు చిత్తూరు వర్సెస్ జీడీ నెల్లూరు మధ్య ఫైనల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
బ్యాడ్మింటన్‌లో ఆకట్టుకున్న తల్లీకూతురు
మెసానికల్ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆడుదాం ఆంధ్రా పోటీల్లో భాగంగా పురుషులు, మహిళల విభాగంలో మ్యాచ్‌లు నిర్వహించారు. మహిళల విభాగంలో చిత్తూరు, జీడీనెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన ఫిరోజ్ బేగం (అసిస్టెంట్ ప్రొఫెసర్, అపోలో యూనివర్సిటీ), ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె కుమార్తె రాఫియాముస్కాన్ ఆటతీరు క్రీడాభిమానులకు ఆకట్టుకుంది. జిల్లా స్థాయి మహిళళ బ్యాడ్మింటన్ పోటీల్లో జీడీ నెల్లూరు టీమ్‌పై చిత్తూరు జట్టు గెలుపొందింది.
నేడు ముగింపు కార్యక్రమం
మెసానికల్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు శనివారం జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేయనున్నారు. ఇప్పటి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో గెలుపొందిన జట్లకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహంగా ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.2.55 లక్షల చొప్పున రూ.17.85 లక్షలు అందజేసింది.ఈ మేరకు విజేతల ఖాతాల్లో నగదు జమచేశారు. అలాగే జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లకు రూ.4.65 లక్షల నగదు ఇవ్వనున్నారు.
source : sakshi.com
Discussion about this post