ఓ దళిత మహిళ ఇంటిని వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూల్చిన ఘటన అనంత నగరంలోని కృపానందనగర్ శుక్రవారం చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే సదరు నాయకుని అనుచరులు పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లతో వచ్చి దౌర్జన్యంగా ఇంటిని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన బాధితులు లక్ష్మీదేవి, వెంకటలక్ష్మీలను పక్కకు తోసి మరీ కూల్చివేశారు.
లక్ష్మీదేవి తెలిపిన వివరాల మేరకు.. తాము 35 ఏళ్లుగా నివశిస్తున్నామన్నారు. సదరు ఇంటి స్థలానికి సంబంధించి ఇంటి, నీటి పన్నులు చెల్లిస్తూ వచ్చామన్నారు. తన పేరు మీద 2004లో మూడు సెంట్లు మంజూరు చేస్తూ రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారన్నారు. ఆ స్థలంలోనే తాము ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. గురునాథరెడ్డి అనుచరులు స్థలం తమది అంటూ దౌర్జన్యంగా ప్రవేశించి మహిళలని చూడకుండా లాగేసి ఇంటిని పడగొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ స్థలాన్ని (సర్వే నంబరు 264/1) మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి సోదరుడు రెడ్డెప్పరెడ్డి 1985లో గోరంట్లకు చెందిన టి.ఎస్.మల్లికార్జున నుంచి 13 సెంట్లు కొనుగోలు చేశారని అందుకు సంబంధించిన దస్త్రాలు తమ వద్ద ఉన్నాయని, ఆధారాలతోనే కూల్చి వేశామని మాజీ ఎమ్మెల్యే ప్రతినిధి తెలిపారు.
source : eenadu.net
Discussion about this post