రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్ హయాం ఒక శాపంగా మారిపోయింది. కేంద్రం నుంచి నిధులూ తీసుకురాలేకపోయారు. పోలవరం ప్రాజెక్టుపై ఖర్చూ చేయలేకపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం జగన్ సాధించింది ఏమీ లేదు. ఆయన గద్దెనెక్కిన తర్వాత ఈ అయిదేళ్లలో పోలవరం అన్యాయమైపోయింది. కేంద్ర ఆర్థికమంత్రి 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభకు సమర్పించారు. అందులో పోలవరం అథారిటీకి సమావేశాల నిర్వహణ పేరుతో రూ.లక్ష మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చూపారు. ఈ ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రుణం తీసుకుని బడ్జెటేతర వనరుల ద్వారా నిధులిస్తామని కేంద్రం ఎప్పుడో ప్రకటించింది.
తాజా బడ్జెట్‌లో ఆ విభాగం కింద అన్ని ప్రాజెక్టులకూ కలిపి రూ. 2,500 కోట్ల కేటాయింపులే చూపారు. పోలవరానికి రావాల్సిన నిధులూ తెచ్చుకోలేకపోయాం. రెండో డీపీఆర్‌ను కేంద్రం ఆమోదిస్తే తప్ప కొత్తగా నిధులొచ్చే అవకాశం లేదని ఎప్పుడో తేలిపోయింది. ఇంతలో తొలిదశ నిధులంటూ కొత్త ప్రహసనం మొదలైంది. వాటికి కేంద్రం ఇంతవరకు పెట్టుబడి అనుమతులూ ఇవ్వలేదు. ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి 22 మంది లోక్‌సభ ఎంపీలను గెలిపించాం. రాజ్యసభలోనూ తగినంత బలం ఇచ్చాం. ఆ బలాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు తప్ప రాష్ట్రం బాగుకోసం వినియోగించకపోవడంతో.. పోలవరం ప్రాజెక్టుకు ఈ అయిదేళ్లలో కేంద్రం నుంచి జగన్ అదనంగా ఏమీ సాధించలేకపోయారు. రూ.47,725 కోట్లతో పోలవరం ప్రాజెక్టుకు రెండో డీపీఆర్‌ను 2019లోనే రివైజ్డ్ కాస్ట్‌కమిటీ ఆమోదించింది. ఆ మొత్తానికి ఇంతవరకూ పెట్టుబడి అనుమతులు సాధించలేదు.
2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,042 కోట్ల కేటాయింపులు చూపారు. కానీ డిసెంబరు నెలాఖరు వరకు చేసిన ఖర్చు రూ.534.80 కోట్లే! ఇంతవరకు మొత్తం పోలవరంపై చేసిన ఖర్చులో రూ.1,554 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఆ నిధులు రావాలంటే రెండో డీపీఆర్ లేదా తొలిదశ నిధులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయాలి. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప కేంద్రం నుంచి నిధులొచ్చే ఆస్కారం లేదు. జగన్ పాలనలో కేంద్రం నుంచి పోలవరం రెండో డీపీఆర్‌కు ఆమోదం పొందడంలో ఇంతవరకు సఫలం కాలేదు.
source: eenadu.net
Discussion about this post