గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఆడుదాం..ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది దశకు చేరుకున్నాయి. 2023 డిసెంబర్ 15న జిల్లాలో ప్రారంభమైన పోటీలు మండల, నియోజకవర్గ స్థాయిలో ముగిశాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 31వ తేదీ (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ క్రీడాంశాల్లో 684 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
రికార్డు స్థాయిలో క్రీడాకారులు హాజరు
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంరంభానికి శ్రీకారం చుట్టారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఇలా మొత్తం 5 క్రీడాంశాల్లో గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకూ పోటీలు నిర్వహించారు. ఆయా మండలాల్లోని 502 క్రీడా మైదానాల్లో పోటీలు నిర్విరామంగా జరిగాయి. వివిధ క్రీడాంశాల నిర్వహణకు ప్రభుత్వం 5,440 మంది వలంటీర్లు, 2,160 మంది అంపైర్లు, 350 మంది పీడీలు, పీఈటీలను నియమించింది. అలాగే జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 62,016 మందికి ప్రభుత్వం టీ షర్టులు, టోపీ, ఇతర క్రీడా సామగ్రిని అందజేసింది.
రెండు ప్రాంతాల జిల్లా స్థాయి పోటీలు
జిల్లా స్థాయి పోటీలు పుట్టపర్తి, పెనుకొండలలో జరగనున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మైదానంలో పురుషుల వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు ఉంటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా పురుషుల, మహిళల షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు పెనుకొండలోని క్రీడా వికాస కేంద్రం డిగ్రీ కళాశాల వెనుకవైపు ఉన్న మైదానంలో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
source : sakshi.com
Discussion about this post