శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు నిర్వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌కు పెనుకొండ మండలంలోని మోటువారిపల్లిలో నిరసన సెగ తాకింది. ఆదివారం ఆమె హరిపురం, కురుబవాండ్లపల్లి, మోటువారిపల్లి గ్రామాల్లో ఆత్మీయ పలకరింపు నిర్వహించారు. తమ గ్రామానికి తారు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని మోటువారిపల్లి గ్రామస్థులు మంత్రిని కోరారు. తెదేపా హయాంలో రూ.3.42 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం వేశారని, ప్రభుత్వం మారాక ఐదేళ్లనుంచి పనులు ప్రారంభించలేదని వాపోయారు. సమస్యను సావధానంగా వినకుండానే మంత్రి వెళ్లిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, తారురోడ్డు సౌకర్యం కల్పించకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
source : eenadu.net
Discussion about this post