అనంతపురం తన మనసుకి చాలా దగ్గరగా ఉండే జిల్లా అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఉరవకొండలో జరిగిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. అనంతపురానికి నీరిస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తరలించి రైతుల్ని ఆదుకున్నాం. జీడిపల్లి, గొల్లపల్లి, గుంతకల్లు, మడకశిర బ్రాంచ్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు పూర్తి చేసింది తెదేపానే. అవసరమైతే కాలువలు వెడల్పుచేసైనా మళ్లీ నీళ్లు తెస్తాం. వైకాపా పాలనలో వీటన్నింటిని అటకెక్కించారు. ఒక్క ఉరవకొండలోనే రూ.30 కోట్ల విలువైన సామగ్రి కుళ్లబెట్టారు. బుద్ధి ఉన్నావారెవరైనా ఇలా చేస్తారా? 90 శాతం సబ్సిడీతో జిల్లా రైతులకు డ్రిప్ పరికరాలు అందించాం. జిల్లాకు నీరిస్తే ఇక్కడి రైతులతో గోదావరి జిల్లాలు కూడా పోటీపడలేవు. పది సార్లు విదేశాలకు తిరిగి కియా మోటార్స్‌ను తీసుకొచ్చాం. వేలాది మంది అందులో పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఉంతకల్లు, బైరవానితిప్ప ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. శింగనమల, గార్లదిన్నెల్లో షాదీఖానాలు నిర్మిస్తామన్నారు.
source : eenadu.net










Discussion about this post