విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస వద్ద జాతీయ రహదారి పక్కన శనివారం ముఖ్యమంత్రి జగన్ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎన్నికల శంఖారావంగా భావిస్తున్న సభకు 34 నియోజకవర్గాల కార్యకర్తలు, గృహసారథులు హాజరవ్వాలని హుకుం జారీ చేశారు. ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద తెదేపా యువనేత లోకేశ్ యువగళం ముగింపు సభ విజయవంతమైంది. ఆ సభను మించి విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి టార్గెట్లు పెట్టి ఆదేశాలిచ్చారు. అయితే డ్వాక్రా గ్రూపు మహిళలను బలవంతంగా సభ వద్దకు తరలించినా.. ఎక్కువసేపు ఆపే పరిస్థితి లేదని, సాధికారిక యాత్రల్లో ఇది స్పష్టమైందని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లోకి వెళ్లిన కార్యకర్తలు, మహిళలు బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల మధ్య జగన్ తిరిగేలా సభ ముందు ‘టీ’ ఆకారంలో ర్యాంప్ ఏర్పాట్లు చేస్తున్నారు.
source : eenadu.net










Discussion about this post