రైతుల ఆకాంక్షలను నెరవేర్చేలా పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాల్లోని 193 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుడుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన ‘డాక్టర్ వైఎస్సార్ రైతు విజయ సంకల్ప యాత్ర’ ఆరో రోజూ బుధవారం పుట్టపర్తి రూరల్ మండలంలో కొనసాగింది. ఉదయం పెడపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పెద్ద తండా, కోనాపురం, మార్లపల్లి, సూరగానిపల్లి, కొట్లపల్లి, కొత్తనిడిమామిడి, నిడిమామిడి, దండువారిపల్లి, కత్తివారిపల్లి మీదుగా కొనసాగించారు. ఈ సందర్భంగా గాజులపల్లి సమీపంలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ ఎమ్మెల్యే దుద్దుకుంట భూమి పూజ చేసి అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాదయాత్రలో రైతులు, యువత, పార్టీ శ్రేణులు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు. గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పెద్దతండా వద్ద సర్పంచ్ మంగ్లీబాయి, యర్రా భాస్కర్ తిరుపాల నాయక్ క్రెయిన్ తో భారీ పూలహారాన్ని ఎమ్మెల్యేకు వేశారు.
source : sakshi.com
Discussion about this post