రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గత 56 నెలలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలు ఇవ్వడమే గానీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, నారాయణస్వామితో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. జగదీశ్ మాట్లాడుతూ.. గతేడాది జులైలో కళ్యాణదుర్గం బహిరంగ సభలో జగన్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకముందే మంగళవారం ఉరవకొండలో మరోసారి వాగ్దానాలు చేశారని ఎద్దేవా చేశారు. బీటీపీ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.208 కోట్ల పరిహారం ఇస్తామని సీఎం జగన్ కళ్యాణదుర్గం సభలో ప్రకటించినా కేవలం రూ.70 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. నాయీ బ్రాహ్మణులు ఇతర వెనుకబడిన కులాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ఈద్గా మసీదు, బీసీ రెసిడెన్సియల్ స్కూల్ అంబేడ్కర్ భవనాల నిర్మాణాలకు స్థలసేకరణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జాఫర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజాస్వామికవాది అని అంటూ ఉరవకొండ సభలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు.
source : eenadu.net










Discussion about this post