మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించిన పార్టీ కూడా వైకాపానే అని తెలిపారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడానికి జరిగేది కాదు. పెత్తందారులకు, పేదవారి పక్షాన నిలిచినవారికి మధ్య యుద్ధం. అయిదేళ్లలో మన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధికి.. చంద్రబాబు చెప్పే డ్రామాలకు మధ్య యుద్ధం. చంద్రబాబు పేరు చెబితే మంచి చేశారని.. మంచి పథకం తీసుకొచ్చారని చెప్పుకోవడానికి ఒక్కటీ గుర్తురాదు. 57 నెలల పాలనలో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్థి మనసులో చోటు సంపాదించుకోగలిగాం. మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే ఇంత చేశాం. ఇక రెండు, మూడు, నాలుగోసారీ అవకాశం ఇస్తే ఎంత చేయగలమో ఆలోచించండి. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాలని చెప్పాలి.
లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి. ఫ్యాన్‌కు ఓటేస్తే మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవడమే. సైకిల్‌కు ఓటేస్తే ఇంగ్లిష్ మీడియంను రద్దు చేయడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇంటికే పింఛను రావాలన్నా, వాలంటీరు వ్యవస్థ కొనసాగాలన్నా ఓటేయాలని ప్రతి అవ్వాతాత, ప్రతి దివ్యాంగుడు, అక్కచెల్లెమ్మలు బయటకు వచ్చి కనీసం వంద మందికైనా చెప్పాలి’’ అని జగన్ పేర్కొన్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో సచివాలయం, డిజిటల్ లైబ్రరీ, ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని చెప్పండి. అయిదేళ్ల కిందట లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తాయని ఊహించారా? జగన్ మార్కు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు మీకెందుకు ఓటేయాలని చంద్రబాబును ప్రశ్నించండి. జగన్ పాలన బాగాలేదని నమ్మితే పొత్తులు ఎందుకని నిలదీయండి’ అని తెలిపారు.
‘మరో 55 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు గెలవాలి. అయిదేళ్ల పాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. అందుకే ఒక్కటీ తగ్గడానికి వీల్లేదు. చంద్రబాబు వేసే బాణాలకు బలయ్యేందుకు నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని. కొన్ని లక్షల గుండెలు కృష్ణుడిలా తోడుగా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది వచ్చే ఎన్నికలే. పొరపాటు చేస్తే ప్రతి ఒక్కరూ నష్టపోతారు. ఈ ఒక్కసారి వైకాపా గెలిస్తే ఏపీ రూపురేఖలే మారిపోతాయి. పేదవారి పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలన్నా.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలన్నా వైకాపాకు ఓటేయండి’ అని సీఎం జగన్ కోరారు. ఈ సభలో మ్యానిఫెస్టో విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అదేమీ లేకపోవడంతో కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.
source : eenadu.net
Discussion about this post