రాష్ట్రంలో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుందని.. దానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నేను చేసిన మంచి కారణంగా చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే. ప్రతిపక్షాలన్నీ జగన్, వైకాపా, పేదవాడి భవిష్యత్తు నాశనం లక్ష్యంగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నా’ అని పేర్కొన్నారు. ‘సిద్ధం’ పేరిట విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో శనివారం నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘అబద్ధానికి-నిజానికి, మోసానికి-విశ్వసనీయతకు మధ్యే ఈ యుద్ధం. చంద్రబాబు 2014 మ్యానిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి పది శాతమైనా అమలు చేయలేదు. మెరుగైన పాలన చేయొచ్చని ఆయనకు అనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వైకాపా, జగన్ మార్కు ప్రగతి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ సైన్యంగా పనిచేస్తూ ప్రతిపక్షాల దాడులు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. బూత్ కమిటీల సభ్యులు, గృహసారథులు, వాలంటీర్లతోపాటు కార్యకర్తలనుంచి రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలి. ప్రతి గ్రామం నుంచి 60 శాతం ప్రజలు, కుటుంబాలు మన వెంట ఉంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలన్నీ ఎందుకు రావు?’ అని జగన్ ప్రశ్నించారు.
‘దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వైకాపా నాయకులు, కార్యకర్తలను డైరెక్టర్లు, ఛైర్మన్లుగా నియమించాం. మార్కెట్‌యార్డులు, దేవాలయ బోర్డుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేశాం. వాలంటీర్లకు పార్టీపై ప్రేమ, అభిమానం ఉండటం వల్లే ప్రతి ఇంటికీ పథకాలు అందిస్తున్నారు. నన్ను నమ్ముకున్నవారికి వార్డు సభ్యుడి నుంచి రాజ్యసభ స్థానాల వరకు అవకాశం కల్పిస్తున్నా. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. ప్రతి పేదవాడి భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ జగనే రావాలి. అలాగైతేనే పిల్లలకు ఆంగ్ల మాధ్యమం చదువులు, ట్యాబ్‌లు తదితరాలు అందుతాయి. ఎన్నికలకు ముందు కిలో బంగారం, ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తామంటూ కొందరు మోసం చేస్తారు. ప్రతిపక్షాలకు ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దును ఆమోదించినట్లే. లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థను సమర్థించినట్లే’ అని జగన్ పేర్కొన్నారు. ‘సభకు హాజరైన ప్రతి ఒక్కరిలో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తోంది. కానీ కౌరవ సైన్యంలో దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా ఉంది. వారిలో కుట్రలు, కుతంత్రాలు, పొత్తులు, ఎత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలి అవడానికి నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని. మీరంతా కృష్ణుడి రూపంలో అండగా ఉన్నంత కాలం భయపడను. 56 నెలల్లో పేదలపై ప్రేమ, బాధ్యతతో అమలుచేస్తున్న పథకాలే నాకు అస్త్రాలు’ అని జగన్ వివరించారు.
source : eenadu.net
Discussion about this post