బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కువ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లలో కోత వేశారు. ఇప్పటివరకు జనసేనకిచ్చే 24 అసెంబ్లీ స్థానాల్లో మూడు సీట్లు తగ్గించి 21 స్థానాలతో సరిపెట్టారు. మొత్తంమీద బీజేపీ, జనసేనకు కలిపి 31 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లను చంద్రబాబు కేటాయించారు. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు మూడు పార్టీల ఉమ్మడి ప్రకటనను చంద్రబాబు సోమవారం రాత్రి ఎక్స్ (ట్విటర్)లో విడుదల చేశారు. 31 ఎమ్మెల్యే సీట్లలో 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనన్నాయి.
అంతకు ముందు జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలోనూ ఒకటి తగ్గిపోయిన విషయం తెలిసిందే. అంటే 2 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయనుంది. 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఈ సీట్ల సర్దుబాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబుకు లొంగిపోయినట్లు స్పష్టమైంది. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్టీ ముఖ్య నేత బైజయంత్ పాండా సోమవారం విజయవాడ వచ్చి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లారు. వారి మధ్య రాత్రి వరకు చర్చలు జరిగాయి.
తొలుత బీజేపీ పెద్దలు తమకు, జనసేనకు కలిపి 45 ఎమ్మెల్యే, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన చంద్రబాబు ఎట్టకేలకు వారిని 10 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లకు ఒప్పించారు. రెండురోజుల క్రితం ఎన్డీఏతో పొత్తు ఖరారైన రోజే సీట్ల పంపకం కూడా పూర్తయినట్లు చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పింది నిజం కాదని తాజా చర్చలతో స్పష్టమైంది. బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ఆరోజు పార్టీ నేతలకు చెప్పారు. వాస్తవానికి ఢిల్లీలో ఎన్డీఏలో టీడీపీ చేరడం మాత్రమే జరిగింది. సీట్లపై అసలు చర్చ కూడా జరగలేదు. కానీ చంద్రబాబు తనకు అనుకూలంగా ఎల్లో మీడియా ద్వారా సీట్ల పంపకం కూడా పూర్తయినట్లు ప్రచారం చేయించారు. సీట్ల పంపకం పూర్తయిన నేపథ్యంలో ఆయా పార్టీలు.. తమ కేటాయించిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సీట్ల సంఖ్య ముఖ్యం కాదు: పవన్
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని జనసేన అధ్యక్షుడు సోమవారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్ల పంపకం జరిగిందన్నారు. సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులకంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని స్పష్టం చేశారు. మూడు పార్టీలూ దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయన్నారు. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాది పడిందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఎన్డీఏలో భాగస్వాములుగా సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. ఈ రోజు చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జనసేన పార్టీ కార్యాలయం కూడా సీట్ల పంపకంపై ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది.
source : sakshi.com
Discussion about this post