‘వైకాపా అధికారంలోకి వచ్చాక, నేను మంత్రి అయినప్పటి నుంచి జగన్‌ను దేవునిలానే చూశా. కానీ 2022 నుంచి ఆయన శిల్పంలా మారిపోయారు. ఆ శిల్పానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి పూజారులు. మాలాంటి భక్తులతో శిల్పం మాట్లాడటం లేదు. ఆ శిల్పం వెనుక నుంచి ఈ ఇద్దరు పూజారులే శిల్పం తరఫున మాతో మాట్లాడుతున్నారు. ఆ సామాజికవర్గం వారికి, వారి వారసులకే న్యాయం చేస్తున్నారు’ అని మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లపాటు మంత్రిగా ఉండి కూడా కనీసం తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందలేదనే అవమాన భారంతోనే వైకాపాను వీడుతున్నానని, మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఆలూరు అభివృద్ధి కాకపోవడానికి నా కులమే కారణమా?
‘ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను ఆలూరు నుంచి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి డోన్ నుంచి ఇద్దరం మంత్రులుగా ఉన్నాం. నా నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు కానీ డోన్ అభివృద్ధి అయింది. నా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడానికి నా కులమే కారణమా? లేదా ఆయన(బుగ్గన) సమర్థుడు, నేను అసమర్థుడినని చేయలేదా అనేది చెప్పలేను. డోన్ అభివృద్ధి జరిగినప్పుడు ఇక్కడ మీరెందుకు అభివృద్ధి చేయలేకపోయారని నన్ను ఆలూరు ప్రజలు అడుగుతున్నారు. నియోజకవర్గంలో ఏ పనికీ ఒక్క బిల్లు కూడా నాకు ఇవ్వలేదు. అందువల్ల అభివృద్ధి చేయలేకపోయా. అభివృద్ధి జరగలేదు కాబట్టి అక్కడి ప్రజల్లో నీకు బలం లేదు. నిన్ను తీసేస్తున్నాం అని ఇంకొకరిని అక్కడ నియమించారు. ఇది మనస్తాపానికి గురిచేసింది. నియోజకవర్గ అభివృద్ధి జరగకపోవడంలో నా ప్రయత్న లోపమేముంది? మంత్రిగా నేను జిల్లాలకు వెళ్లినపుడు మా నియోజకవర్గాలకు కార్మికశాఖ నుంచి ఏదైనా సహకారం ఇవ్వండన్నా అని ఎమ్మెల్యేలు అడిగేవారు. అమ్మఒడి, ఆసరాలాంటివి ఇవ్వగలను తప్ప, నా శాఖ నుంచి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవని వారికి చెప్పేవాడిని. అదీ మంత్రిగా నా పరిస్థితి. ఆలూరు నియోజకవర్గంలో వేదవతి, నగరదోన ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రైతులకు న్యాయం జరిగేది. బిల్లులు రాక వాటి పనులు ఆగిపోయాయి. ఆలూరు అభివృద్ధి పనుల కోసం మాకు, సీఎంకు మధ్య ఉండే ధనుంజయరెడ్డిలాంటి పెద్దలను కలిసి అనేక సార్లు అడిగా. ఏ పనీ జరగలేదు. సీఎంను కలిసి అడిగితే చేద్దామంటారే తప్ప ఏమీ చేయరు.
పెత్తందార్లు హేళన చేస్తున్నారు..
ముఖ్యమంత్రి చెబుతున్న నా..నా..నా..అనే పదానికి న్యాయం జరగలేదు. ఎందుకంటే మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏం జరిగిందనేది పరిశీలిస్తే మీకే (విలేకరులను ఉద్దేశించి) అర్థమవుతుంది. జిల్లాలో మొత్తం 14 సీట్లలో నాలుగు సీట్లలో అభ్యర్థులను మార్చారు. ఆ నాలుగులోనూ రెండు ఎస్సీ, ఒకటి బీసీ, మరొకటి ముస్లింది. మిగిలిన పదింటిలో ఒకే సామాజికవర్గం వారున్నారు. వారిలో ఎవరినీ కదిలించలేదు. దళితులు, బీసీ, మైనారిటీనే సీఎం మార్చారు.. మిగిలినవి మార్చలేదని మమ్మల్ని కులం పేరుతో పిలిచే పెత్తందార్లు హేళనగా మాట్లాడుతున్నారు.
నేను తెదేపాలో చేరి, ఆ పార్టీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేయబోతున్నా. నా రాజకీయ ప్రస్థానం 1983లో తెదేపా ఏజెంట్‌గా మొదలై, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుడి వరకు సాగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మా సామాజికవర్గం ఎక్కువగా ఉన్నందున రెండు జిల్లాల్లోనూ పనిచేయాలని చంద్రబాబు నాకు చెప్పారు. నేను పుట్టిన ఊరు గుంతకల్లులో ఉంది కాబట్టి ఆ నియోకజవర్గానికి సేవ చేయాలని, ఆ సీటు కోరుకున్నా. రెండు జిల్లాల్లో తెదేపా విజయానికి నా పూర్తి సహకారమందిస్తా. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలాగా నేను మళ్లీ వైకాపాలోకి వెళ్లే అవకాశం లేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేను కాంగ్రెస్‌లో చేరే విషయమై మాట్లాడాననేది అవాస్తవం. కర్ణాటకలో నా తమ్ముడు మంత్రిగా ఉన్నారు. కష్టసుఖాలను మా తమ్ముడితో మాట్లాడుకుంటానే తప్ప కాంగ్రెస్‌లో ఎవరితోనూ ఎప్పుడూ చర్చించలేదు’ అని జయరాం వివరించారు.
source : eenadu.net
Discussion about this post