అనంతపురం క్రైం:
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 175 ఫిర్యాదులు అందాయి. నగర డీఎస్పీ ప్రసాద రెడ్డి వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులకు సూచించారు.
పచ్చని పంటను నాశనం చేస్తున్నారు.
కొందరు కావాలనే ట్రాక్టర్లతో సాగు చేసిన పంటను తొలగించి అప్పుల ఊబిలోకి నెట్టారని ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి చెందిన మహిళా రైతు నీలావతి వాపోయింది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆమె దరఖాస్తు సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తన భర్త పూర్వీకుల నుంచి సంక్రమించిన 5.5 ఎకరాల భూమిలో పప్పుశనగ సాగు చేశాడని వివరించింది. రెండు రోజుల క్రితం మడమంచి సురేష్, మదమంచి అభిలాష్, ఇల్లూరు అశోక్, చింతలంపల్లి శ్యామ్, గాయత్రి… రాత్రిపూట ట్రాక్టర్‌తో పంటను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు.
గతేడాది కూడా ఇలాగే పంటను తొలగించారని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈసారి నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చానని వివరించింది. అక్రమార్కులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
మహిళల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది:
నార్పల:
మండలంలోని వివిధ ప్రాంతాల్లో గత వారం రోజులుగా అదృశ్యమైన ఇద్దరు మహిళల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం నార్పల్ ఎస్ ఐ రాజశేఖరరెడ్డి వివరాలు వెల్లడించారు. మలవాండ్లపల్లి గ్రామానికి చెందిన మహిళ, మూగే తిమ్మంపల్లి గ్రామానికి చెందిన మరో మహిళ గత వారం వేర్వేరుగా అదృశ్యమయ్యారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల ఆచూకీని గుర్తించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Discussion about this post