ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజారిటీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమైనా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్‌సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ‘మంచి’ ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి.
‘రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 57 నెలలుగా లంచాలు, వివక్షకు తావులేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికీ వెళ్లండి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికీ మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో మంగళవారం సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
source : sakshi.com
Discussion about this post