తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగుడైన వాలంటీరును విధులనుంచి తొలగించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక పరిధి నిడుబ్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడుబ్రోలు టిడ్కో గృహంలో కొల్లూరు నవీన్ నివసిస్తూ 12వ వార్డు పరిధిలో వాలంటీరుగా సేవలందిస్తున్నారు. గతేడాది డిసెంబరు 14న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జన్మదినం సందర్భంగా నవీన్ చింతలపూడికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాలను స్థానిక వైకాపా నాయకులు పార్టీలోని కీలక నేతకు పంపించారు. నవీన్‌ను విధుల నుంచి తొలగించాలని వైకాపా కీలక నేత పురపాలక అధికారులకు మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. ఆ మేరకు పురపాలక అధికారులు తనిఖీ పేరుతో 12వ వార్డు సచివాలయానికి వెళ్లారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న నెపంపై వాలంటీరును విధులనుంచి తొలగించారు. తన వివరణ తీసుకోకుండా వైకాపా నేతల ఆదేశాల మేరకు ఏకపక్షంగా విధులనుంచి తొలగించారని నవీన్ వాపోతున్నారు.
source: eenadu.net
Discussion about this post