తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 14న ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండె ఆగి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామానికి రానున్నారన్నారు. ధర్మవరంలోని మారుతీరాఘవేంద్ర కల్యాణ మండపంలో చేనేత కార్మికులతో నిర్వహించే కార్యక్రమంలోనూ ఆమె పాల్గొని చేనేతల సమస్యలు తెలుసుకోనున్నారన్నారు. కార్యక్రమంలో తెదేపా శ్రేణులు, చేనేతలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక చైతన్య ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిపారు. ప్రచార రథంలో వినతుల బాక్స్ ఏర్పాటు చేశామని ప్రజలు వారి సమస్యలను అందులో వేయవచ్చన్నారు. ప్రతి గ్రామంలోనూ చైతన్య రథాలు పర్యటిస్తాయన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో తెదేపాను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అందుకు అన్ని వర్గాల ప్రజలతోపాటు యువత సిద్ధం కావాలన్నారు. చైతన్య రథాలను శ్రీరామ్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు ఫణికుమార్, చంద్రమోహన్‌బాబు, నాగూర్ హుసేన్ పాల్గొన్నారు.
source : eenadu.net
Discussion about this post