మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డెయిరీ లాభాల కోసమే విజయా డెయిరీని మూసివేసి రైతులను తీవ్రంగా మోసం చేశాడని చిత్తూరు జెడ్పీచైర్మన్ శ్రీనివాసులు, డీసీసీబీ చైర్‌పర్సన్ మొగసాల రెడ్డెమ్మ అన్నారు. బైరెడ్డిపల్లెలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శివశక్తి డెయిరీ ఏర్పాటు చేయడంతో ఎంతోమంది రైతులు లాభాలు పొందుతున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు గంగాధర నెల్లూరులో నిర్వహించిన రా కదిలిరా కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హేళన చేస్తూ మాట్లాడడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టగానే మంత్రిగా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీతో పాటు జనసేన మద్దతుగా ఉన్నాయని, ఆ నాడు రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారో చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణమాఫీ, తదితర హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు కిలోబియ్యం రూ.2 ఉంటే రూ.5.25కు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కరువును మాత్రమే చూశామన్నారు. అరకొరగా వచ్చే నీటితో సాగు చేసిన రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని వివరించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తరువాత సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పొనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎన్నికల పరిశీలకులు బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు.
source :sakshi.com
Discussion about this post