పేదలు 60 గజాల స్థలానికి అర్జీ పెట్టుకుంటే… దరఖాస్తు ఎక్కడుందో తెలియదు.. ఏ దశలో ఉందో తెలియదు.. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే.. చూసినా మంజూరవుతుందో లేదో తెలియదు! కానీ… పరిశ్రమలు పెడతామని… రెండు కంపెనీలు దరఖాస్తు చేస్తే… ఆఘమేఘాలపై దస్త్రం కదిలి… అసలు వాటికంత భూమి అవసరమో లేదో తేల్చకుండా… నిబంధనలేవీ పట్టించుకోకుండా… కమిటీ నిర్ణయించిన ధరలో సగానికే… దరఖాస్తు చేసిన రోజే అనుమతులిచ్చేసి… విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసేస్తే… అందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీలు… జగన్ కంపెనీల్లోకి రూ.కోట్లను పారిస్తే… దాన్నేమనాలి? …‘హెటిరో అరబిందో సమేత జగన్మాయ’ అనాలి!
ఉమ్మడి ఏపీకి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 250 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. 2006 అక్టోబరు 27న అనుమతి వచ్చింది. ఈ సెజ్‌లో తమకు చెరో 75 ఎకరాలు కావాలంటూ అరబిందో, హెటిరో ఫార్మా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తు చేసిన రోజునే.. భూ కేటాయింపు జరిగిపోయింది. అదే జగన్మాయ. నాడు తన తండ్రితో కలిసి తనయుడు జగన్ చక్రం తిప్పారు. జడ్చర్ల సెజ్‌లో ఆ రెండు సంస్థలకు.. కమిటీ నిర్ణయించిన ధరలో సగం సొమ్ముకే చెరో 75 ఎకరాల చొప్పున కట్టబెట్టారు. ఇదంతా ఊరికే ఏం చేయలేదు. బదులుగా ఆ రెండు కంపెనీల నుంచి రూ.29.50 కోట్లు జగన్ కంపెనీలకు చేరినట్లు సీబీఐ, ఈడీ వెల్లడించాయి. దర్యాప్తులో తేలిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో సీబీఐ, ఈడీ వేర్వేరుగా ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. జగన్‌ను ఏ1గా, విజయసాయిరెడ్డిని ఏ2గా పేర్కొన్నాయి. అరబిందో, హెటిరో గ్రూపులను, జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రాస్టక్చ్రర్ ప్రై.లి.నూ నిందితులుగా చేర్చాయి. ఇప్పటికి పదకొండేళ్లయినా విచారణ ముందుకు సాగనీయకుండా… సీబీఐ కేసును 264 సార్లు, ఈడీ కేసును 86 సార్లు వాయిదాలు తీసుకుంది… జే గ్యాంగ్!
source : eenadu.net
Discussion about this post