హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడును నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధి ఉన్నారు. ఆయన్ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇటీవల ప్రకటించారు. ఆయన స్థానంలో బివి.వెంకటరాముడును టిడిపి జిల్లా అధ్యక్షునిగా నియమించారు. బివి.వెంకటరాముడు అనేక సంవత్సరాలు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన సమయంలో మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. అనేక సంవత్సరాలుగా పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న ఆయనకు ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ అధ్యక్ష పదవి దక్కింది. బివి.వెంకటరాముడు 1999లో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ కార్యదర్శిగా, 2003లో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శిగా, 2004 నుంచి 2023 వరకు ఉమ్మడి అనంతపురం తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శిగా, 2022లో రాయలసీమ మీడియా కో-ఆర్డినేటర్‌గా, 2023లో నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా, 2024 నుంచి నారా లోకేష్ శంఖారావం రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పని చేశారు. జిల్లాలో అందరూ సీనియర్ నాయకులతోనూ సత్ససంబంధాలు కలిగిన నాయకుడిగా బివి.వెంకటరాముడు ఉన్నారు.
source : prajasakthi.com
Discussion about this post