అతి తెలివితేటలు ప్రదర్శించడంలో జగన్ ప్రభుత్వాన్ని మించినవారు ఉండరేమో. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గతేడాది డిసెంబరులో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. సమ్మె విరమింపజేయడానికి కార్మికులకు ఇస్తున్న రూ.15వేలతో పాటు ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు కలిపి రూ.21 వేలు నెల వేతనంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. డ్రైవర్లకు రూ.24,500 చెల్లిస్తామని ప్రకటించింది. హెల్త్ అలవెన్స్‌ను ఇప్పటి దాకా ప్రభుత్వం ఇస్తుండగా, తాజాగా ఈ భారం నగర, పురపాలికలపై వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంపై భారం లేకుండా తప్పించుకొంది.
జీతాల చెల్లింపునకే గతిలేని పురపాలికలు
ఈనెల 1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమలు చేయాలని, జీతం రూ.21 వేలుగా చేసి కార్మికులకు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే నిధుల్లేక పురపాలికల నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపున కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బిల్లులకు మినహాయించుకొంటుండటంతో పట్టణాల్లో చిన్నపాటి అభివృద్ధి పనులకూ నిధులు లేక ఉసూరుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాలిటీలపై ప్రభుత్వం అదనపు భారం మోపుతుండటంతో అవి ఇక అథోగతిపాలు కావాల్సిందే. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న మున్సిపాలిటీల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది.
అదనపు భారం ఇలా..
అనంతపురం నగరపాలకలో పారిశుద్ధ్య విభాగంలో 409 మంది కార్మికులు పొరుగు సేవల పద్ధతిలో పని చేస్తున్నారు. వీరికి వేతనాల రూపంలో నెలకు నగరపాలక సంస్థ నుంచి నెలకు రూ.61.35 లక్షలు చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయం వల్ల అదనంగా రూ.24.54 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. వీరితోపాటు కరోనా సమయంలో తీసుకొన్న అదనపు కార్మికులు 70 మంది, మలేరియా నివారణ కార్మికులు 33, అత్యవసర పారిశుద్ధ్యంకు 26 మంది మొత్తం 129 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.12 వేలు చొప్పున రూ.15.48 లక్షలు నగరపాలక నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతి నెలా వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతోంది. ఈనెలలో 12 రోజులు గడిచినా కార్మికులకు వేతనాలు అందలేదు.
కళ్యాణదుర్గం లాంటి పట్టణాల్లో పురపాలికకు వచ్చే ఆదాయం కార్మికుల జీతాలు చెల్లించడానికే సరిపోయే పరిస్థితి. తక్కువ ఆదాయం ఉన్న పట్టణాల్లో వచ్చే ఆదాయం కార్మికులకు జీతాలు చెల్లిస్తే మరి పట్టణ అభివృద్ధి ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల కార్మికుల జీతాల బాధ్యతను మున్సిపాలిటీలపై రుద్దకుండా మెడికల్ అలవెన్సులను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నారు.

source : eenadu.net
Discussion about this post