‘జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కట్టిన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. నిర్వహణకు కనీసం నిధులివ్వడం లేదు. అటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయనకు వారసులు ఎలా అవుతారు. రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ఎలా నిలబెడతారు..’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రశ్నించారు. మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ జలాశయాన్ని ఆమె శనివారం సందర్శించారు. దెబ్బతిన్న గేట్లు, ప్రాజెక్టును పరిశీలించారు. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతోనే లక్ష ఎకరాలకు సాగు, ఒంగోలు నగరంతో పాటు 12 మండలాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టు దెబ్బతిందన్నారు. రాజశేఖర్‌రెడ్డిలా సంక్షేమ పాలన అందించడం అంటే ఇదేనా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. సాగు నీటి రంగం సమస్యలు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోవాల్సిన సంబంధిత మంత్రికి అవేమీ పట్టడం లేదన్నారు. సంక్రాంతి సంబరాల్లో నృత్యాలు చేస్తూ బిజీగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పూర్తి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేత కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.
source : eenadu.net
Discussion about this post