వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ద్వారా గ్రామాల్లో రీసర్వే చేపట్టేందుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వందేళ్లుగా చేయని భూసర్వేను తమ ప్రభుత్వం చేస్తోందని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. 2024 సంవత్సరానికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో రీసర్వే అంతంతమాత్రంగా సాగుతోంది. భూహక్కు పత్రాలు అరకొరగా పంపిణీ చేశారు. సరిహద్దు రాళ్లు పాతించే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో 919 రెవెన్యూ గ్రామాలున్నాయి. 2020 డిసెంబరులో రీసర్వే ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు జరిగేలోపు రీసర్వే పూర్తి చేయనున్నట్లు వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ మూడొందల గ్రామాల్లోనూ సర్వే అంతంత సాగింది. ప్రస్తుతం మూడు విడతల్లోనే ముగించేశారు. మిగిలిన గ్రామాల్లో ఎన్నికల తర్వాత చేపట్టనున్నట్లు చెబుతున్నారు.
మూడో విడతలో భాగంగా కర్నూలు జిల్లాలో 160 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. 53 గ్రామాలకు మాత్రమే భూహక్కు పత్రాలు వచ్చాయి. పత్రాలు వచ్చిన గ్రామాల్లోనే సరిహద్దు రాళ్లు పాతించే ప్రక్రియ సాగుతోంది.. నంద్యాల జిల్లాలో సుమారు 150 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. అందులో సగం పూర్తి కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 117 గ్రామాలకే హక్కు పత్రాలు వచ్చాయి.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పొలాల వద్ద హద్దు రాళ్లు పాతిస్తామని చెప్పినప్పటికీ.. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, ఎల్‌పీఎం ట్రైజంక్షన్ పాయింట్ల దగ్గర మాత్రమే నాటుతున్నారు.
source : eenadu.net
Discussion about this post