జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన నివేశ స్థలాల లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో హద్దులు చూపకుండానే అధికార పార్టీ నాయకులకు అనుకూల, మామూళ్లు చెల్లించిన వారికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలో మూడేళ్ల కిందట ప్రభుత్వం 14 జగనన్న లేఅవుట్లలో 1,625 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కాలనీల్లో పక్కాగృహాలను నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. మండలంలో ఇప్పటివరకు 720 మందికి రిజిస్ట్రేషన్లు చేశారు. కనీసం సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించకుండా వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులు, అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేహాళ్ గ్రామంలో తిమ్మలాపురం రోడ్డులో నీరు నిలిచే లోతట్టు ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. వాటికి వేసిన హద్దుల రాళ్లన్నిటిని తొలగించారు. లబ్ధిదారుల జాబితాను బయటపెట్టడానికి అధికారులు ససేమిరా అంటున్నారు.
source : eenadu.net
Discussion about this post