ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉన్నారని.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక భాజపాకు తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. ‘హోదా’ వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవి. రాజధాని లేదు.. పోలవరం పూర్తికాలేదు.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్‌పై ఒక్క అడుగూ ముందుకు పడలేదని.. వైఎస్ఆర్ ఉండి ఉంటే అది పూర్తయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్ బావుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
‘‘కడప పార్లమెంట్ స్థానం నుంచి నేను పోటీ చేయడానికి కారణం.. వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడం. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారు. ఇది దుర్మార్గం కాదా? హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఒక వైపు రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ ఉన్నారు. ధర్మం కోసం ఒకవైపు నేను.. మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి. ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలి’’ అని షర్మిల అన్నారు.
ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్రావు కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి వైఎస్ షర్మిల ఆహ్వానించారు. వైకాపాలో అవమానాలు ఎదుర్కోలేకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఇటీవల కృపారాణి వెల్లడించిన సంగతి తెలిసిందే.
source : eenadu.net
Discussion about this post