వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని గద్దెదించడమే ఏకైక లక్ష్యం. తెదేపా, జనసేన, భాజపా మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లు లాంటివి.. వాటిని పక్కాగా అమలు చేస్తాం.. అని తెదేపా అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో మూడు పార్టీలు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తాము స్థానికేతరులు అంటూ సాక్షి పత్రికలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైకాపా నుంచి పోటీ చేసిన రంగయ్య, గోరంట్ల మాధవ్ అసలు ఈ జిల్లా వాసే కాదన్నారు. అనంతపురం వైకాపా ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ ధర్మవరానికి చెందినవారు కాదా? హిందూపురం పార్లమెంటు వైకాపా అభ్యర్థి శాంతమ్మ బళ్లారికి చెందిన మహిళా కాదా? అని గుర్తు చేశారు. అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ మేమంతా తెదేపా కుటుంబ సభ్యులమేనన్నారు. నగరంలో భూగర్భ మురుగు కాలువను నిర్మించడమే తొలి ప్రాధాన్యమన్నారు. నియోజక వర్గాన్ని పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తామన్నారు.
source : eenadu.net
Discussion about this post