సొంతంగా టీవీ ఛానెళ్లు కలిగి ఉన్న రాజకీయ పార్టీలు.. తమ అభ్యర్థులకు వాటిలో అనుకూలంగా ప్రచారం చేస్తే, ఆ ఖర్చును లెక్కలేసి వారి ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఈ తరహా ప్రచారాల్ని నిరంతరం గమనిస్తుంటోందని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు తొలుత నోటీసులు జారీ చేసి, వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల కార్యశాల నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయటం, ఆయా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎక్కడైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే దానికి ఆయా జిల్లాల ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తాం. వారిపై చర్యలు తీసుకుంటాం. రీ పోలింగ్‌కు కూడా ఎక్కడా ఆస్కారం ఇవ్వకూడదు. టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ప్రచురించే ప్రకటనలకు ముందస్తుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా ప్రకటనల్లో ఎక్కడా అభ్యంతరకర అంశాలు ఉండకూడదు. వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రకటనలకు అనుమతి కోసం ఇప్పటివరకు 155 దరఖాస్తులు అందాయి. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా ఉంటుంది. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులు రూ.95 లక్షలు, శాసనసభకు పోటీచేసే వారు రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంది’’ అని మీనా వివరించారు.
రోజుకు రూ.10 లక్షలకు మించి లావాదేవీలు జరిపిన ఖాతాల వివరాలివ్వండి
బ్యాంకు ఖాతాల ద్వారా అధిక మొత్తంలో, అనుమానాస్పదంగా జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖకు, ఎన్నికల సంఘానికి అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను కోరారు. గతేడాది అక్టోబరు 1 నుంచి రోజుకు రూ.10 లక్షలకు మించి, 30 రోజుల్లో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాల వివరాలు తమకు అందజేయాలన్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు అంశాలపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుంచి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తమకివ్వాలని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులు, వారి సంబంధీకులు, రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలకు నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలి
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకూ నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిల్లో 50 శాతం చోట్ల పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధులను వినియోగిస్తూ షాడో ఏరియాల్లోని 689 పోలింగ్ స్టేషన్లకు టవర్ల సదుపాయాన్ని కల్పించే పనులు వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్.ఎం.ఎస్. ప్రచారానికి ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
source : eenadu.net
Discussion about this post