‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కణేకల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ‘తెదేపా హయాంలోనే రూ.4,500 కోట్లు ఖర్చుపెట్టి హంద్రీనీవా ప్రారంభించాం. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ నీరు వస్తోంది. హెచ్చెల్సీ ఆధునికీకరణ కోసం కర్ణాటక వెళ్లి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించింది తెదేపానే. పనులు కూడా మేమే ప్రారంభించాం. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారు. ఆఖరుకు తాగడానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
‘రాయదుర్గంలో కరవు విపరీతంగా ఉండటంతో భైరవానితిప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జీడిపల్లి నుంచి భైరవానితిప్పకు కృష్ణా జలాలు తరలించడం కోసం రూ.962 కోట్లతో పనులు ప్రారంభించాం. టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల మేర కాలువలు పూర్తి చేశాం. 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక సంవత్సరంలోనే భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చేవాళ్లం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్క అంగుళం కూడా పని జరగలేదు. ఉంతకల్లు ప్రాజెక్టుకు రూ.4.5 కోట్లు ఖర్చు పెట్టాం. రూ.1,180 కోట్లతో పూర్తి చేయాలని ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి పనులు ప్రారంభిస్తే వైకాపా అధికారంలోకి వచ్చి పక్కనపెట్టారు. తెదేపా అంటే అభివృద్ధి.. వైకాపా అంటే విధ్వంసం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున.. వైకాపా దొంగలు ఓట్లు అడగడానికి వస్తారు. చొక్కా పట్టుకుని నిలదీయండి. ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రశ్నించండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘రాయలసీమలో తెదేపా బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చింది? వైకాపా ఎన్ని సీట్లు ఇచ్చిందో చర్చకు సిద్ధమా? ఉమ్మడి అనంతపురంలో తెదేపా బీసీలకు పెద్దపీట వేసింది. అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథికి ఎంపీ టికెట్లు ఇచ్చాం. రాయదుర్గంలో బోయ సామాజికవర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులుకు అవకాశం కల్పించాం. మదనపల్లి, నంద్యాలలో ముస్లింలకు టికెట్లు ఇచ్చాం. ఇలా రాయలసీమలో జనాభాకు అనుగుణంగా దామాషా ప్రకారం బీసీలకు పెద్దపీట వేశాం. జగన్ మాత్రం రాయలసీమలో సొంత సామాజికవర్గానికే అత్యధిక సీట్లు కేటాయించారు. ఇదేనా సామాజిక న్యాయం’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కేవలం తెదేపాకే ఉందన్నారు.
source : eenadu.net
Discussion about this post