ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకే ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తోందని తుడా చైర్మన్, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మండలంలోని కేకేవీపురంలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ బోర్డును ఆవిష్కరించి, పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తుడా చైర్మన్ మాట్లాడుతూ జగనన్న రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని కొనియాడారు. అందుకే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ప్రజానీకం కోరుకుంటోందని తెలిపారు. గడచిన నాలుగున్నరేళ్లలో రూ.కోట్ల నిధులను సంక్షేమ పథకాల కింద ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేశారని వివరించారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే ఓటేయమని అడిగిన ధీశాలి సీఎం జగనన్న అని స్పష్టం చేశారు. పేద పిల్లలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నారన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, రైతుభరోసా తదితర పథకాలు ప్రతి ఇంటి ముంగిటకు చేరాయని తెలిపారు. జగనన్న పాలనలో నిరుపేదలు ధైర్యంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25లక్షలకు పెంచి ప్రజారోగ్య రక్షణకు భరోసా కల్పించారని స్పష్టం చేశారు. జగనన్న స్ఫూర్తితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బాటలో ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతానని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులే అని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిరంతరం జనంలోనే ఉంటానని వెల్లడించారు. అనంతరం సొరకాయలపాళెం, నెన్నూరు. నడవలూరు, సి.రామాపురం పంచాయతీల్లో మోహిత్‌రెడ్డి పర్యటించారు. రూ.1.38 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ, ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏవీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఢిల్లీ భానుకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post