తెదేపా, జనసేన పార్టీలు.. పొత్తులో భాగంగా సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం రెండు దఫాలుగా సమావేశమయ్యారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి? అభ్యర్థులుగా ఎవర్ని బరిలో దించాలి? సామాజిక సమీకరణాల పరంగా ఎవర్ని ఎక్కడ సర్దుబాటు చేయాలి? వంటి అంశాలపై అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 8న మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఇద్దరూ కలసి పాల్గొనాల్సిన బహిరంగ సభలు వంటి అంశాలపై ఆ సమావేశంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ గత నెల 13న కూడా భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు.
మూడున్నర గంటలు జరిగిన ఆ సమావేశంలో రెండు పార్టీల పొత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై చాలా వరకు స్పష్టత వచ్చింది. దానికి కొనసాగింపుగా ఆదివారం ఇద్దరు నేతలు మళ్లీ సమావేశమయ్యారు. గత నెల 13న జరిగిన భేటీలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనగా.. ఆదివారం చంద్రబాబు, పవన్ మాత్రమే సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ మూడు గంటలు అక్కడే ఉన్నారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి చంద్రబాబు స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఇద్దరు అగ్రనేతలు కలిసి భోజనం చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో మరోసారి చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్.. 40 నిమిషాలు చర్చలు జరిపారు.
కారు నడుపుతూ వచ్చిన పవన్
ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ తనే స్వయంగా కారును నడుపుతూ వచ్చారు. ఆయన వెనకాల భద్రతా సిబ్బందితో వస్తున్న వాహనాలు పది నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాయి. చంద్రబాబు నివాసం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా పవన్ కారు నడిపారు. కరకట్ట రోడ్డుపైకి రాగానే.. బాపట్లకు చెందిన విజయ్‌కుమార్ అనే దివ్యాంగుడు అక్కడ చక్రాల కుర్చీలో ఎదురు చూస్తున్నారు. బాపట్లలో గతంలో వార్డు కౌన్సిలర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్.. వచ్చే ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ టికెట్ తనకు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరేందుకు వచ్చారు. విజయ్‌కుమార్‌ని చూసిన పవన్ కారు ఆపి, అతనితో కరచాలనం చేసి వెళ్లారు.
source : eenadu.net
Discussion about this post