కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడులో గురువారం రాత్రి బస చేసిన ఆయన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సు యాత్రగా శుక్రవారం ఉదయం బయలుదేరారు. కొద్దిసేపటికే గూడూరు మండలం కొత్తూరు (రామచంద్రాపురం)లో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ‘మా గ్రామంలో 1,200 మంది ఉన్నారు. ఎల్లెల్సీ నుంచి నీటికుంటకు నీటిని అందించి, అక్కడి నుంచి గ్రామంలోని ట్యాంకు ద్వారా సరఫరా చేసేవారు. ఇప్పుడు పైపులైన్లు సరిగా లేకపోవడంతో తాగునీరు రావడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. సీఎం జగన్ బస్సు దిగి కొంత మంది మహిళలతో మాట్లాడారు. సీపీఐ, సీపీఎం నాయకులు కూడా కోడుమూరు పాత బస్టాండులో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. బస్సు యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. కోడుమూరులో దశాబ్దాలుగా తాగునీటి సమస్యను పరిష్కరించలేదని, ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మించి నీరందించాలని నినాదాలు చేశారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం వెళ్లిన తర్వాత వదిలిపెట్టారు.
source : eenadu.net
Discussion about this post